Wednesday, February 15, 2012

నీ కంటి పాపలో నేను



ప్రపంచాన్ని మరచి నీ కళ్ళల్లోకి చూస్తూ
నన్ను తాకే నీ వెచ్చని శ్వాసను ఆస్వాదిస్తూ
నీ కరములను నా కరములచే గట్టిగ హత్తుకొని నువ్వు
నీ ప్రేమ నాకు మాత్రమే సొంతం అనుకుంటూ
భీతన్నది లేక నీ కనురెప్పమాటున నిదురించాలనుకున్నాను

దైవం ఈర్షతో విధి అనే ఆట ఆడుతూ
మట్టిబొమ్మలం అని మనస్సులు విరిచేస్తూ
నిన్ను నా నుండి వేరుచెయ్యాలని ఆకాంక్షిస్తుంటే
బీరువల్లే పారిపోక ఒక్క క్షణం ఆగమని
నీ వియోగము కలిగించక మునుపే నా ఊపిరి గైకొనమంటాను

Saturday, February 4, 2012

నా ఊపిరి



నా నీడవైతే నిన్ను విడిచి చీకటిలో బ్రతికెసేవాన్ని
నా కలవైతే నిదురకు దూరంగా ఉండిపోయేవాన్ని
నా ఊహవైతే బరువెక్కిన హృదయంతో వెలివెసేవాన్ని
నా కన్నీరువైతే ఇంకిపోఎవరకు విలపించేవాన్ని
నా ఊపిరే నువ్వైనప్పుడు ఎలా వదలను కడవరకు నీ నేస్తాన్ని?

నువ్వు నేను


కరగని మనస్సు నీది, దాని జ్ఞాపకాలు దాచిన హృదయం నాది.
కవులకు అందని లాస్యం నీది, ఆ మైకంలో మునిగిఉన్న మనస్సు నాది.

ఎగసిపడే కెరటం లాంటి ఊహలు నీవి, ఆ కడలిన దాగిన బడబాగ్ని మోసేది నేను.
నివురుగప్పిన నిప్పువి నీవు, దహిస్తావు అని తెలిసినా, నిన్ను వీడలేని తత్త్వం నేను.

Sunday, January 29, 2012

జ్ఞాపకం కాదు జీవితం


నీవు నన్ను ద్వేషించినా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటాను
నీవు మౌనంగా ఉన్నా, దాని వెనుక అంతరంగానై నేనుంటాను
నీవు నన్ను వీడిపోతున్నా నీ నీడల్లే నీతోనే ఉంటాను
నీవు నన్ను మర్చిపోమన్నా, నువ్వు జ్ఞాపకం కాదు నా జీవితం అంటాను.

Saturday, December 31, 2011

నా కల


కన్నులకు కలలు సహజం.
ఆ కలలు ఏవేవో ఊహల ఫలితం.

కలలు నిజమైతే కనడం ఓ అర్దం.
కలలు కల్లలైతే కనడం ఎంతో కష్టం.

నా కన్నులు కంటిపాపైన నీకు అర్పితం.
అందులో కన్నీరు మాత్రం నాకు సొంతం.

ఎందరిలో నేనున్నా, నా ఊహలు నీకు అంకితం.
నీ జ్ఞాపకాలతోనే చివరకు అయిపోతానేమో అంతం.

Saturday, December 17, 2011

నీడనే వెలివేస్తావా ?


నీ మాటలతో నాపై వెన్నెల వెదజల్లుతావు.
ఆ నెలవంకలా నాకు ఎప్పటికి అందనంటావు.

నీ చూపులతో కలువ పువ్వులా నన్ను ఆకర్షిస్తావు.
ఆ నీళ్ళల్లో దూరంగా ఉంటూ నా దరికి చేరనంటావు.

నీ ఊహలతో నాలో తీయ్యని గాయాలు రేపి ఆనందిస్తావు.
ఆ గాయాల జ్ఞాపకాలతో నాకు నిదురను దూరం చేస్తావు.

నీ అభిమానంతో నన్ను నీ చుట్టు తిరిగే నీడలా మార్చేస్తావు.
ఆ చీకటిలో ఉంటూ నీ నీడగా ఉన్న నన్ను వెలివేస్తున్నావు.

Sunday, December 4, 2011

నా ఇష్టం...


ఆకలి దప్పిక తీర్చిన అమ్మంటే నాకిష్టం
నడక నడత నేర్పిన నాన్నంటే నాకిష్టం
భవిత భావం భోదించిన గురువంటే నాకిష్టం
కష్టము సుఖము ఒసంగిన భగవంతుడంటే నాకిష్టం
కల్ల కపటము తెలియని పిల్లల నవ్వులంటే నాకిష్టం
అన్నో కొన్నో ఇష్టాలకు దూరమై కష్టంగా నాకున్న,
ఇష్టమైనవాళ్ళకి కష్టం రానివ్వకుండా చూడటం నాకింకా ఇష్టం.